TTD: ఏపీలో రామరాజ్యం ప్రారంభమైంది: రమణ దీక్షితులు
- వంశపారంపర్య అర్చకత్వ హక్కును తిరిగి కల్పించాలి
- ఏడాదిగా స్వామి వారి కైంకర్యాలకు దూరంగా ఉన్నా
- స్వామి వారికి చేసుకునే భాగ్యం నాకు కల్పించాలి
ఏపీలో జగన్ విజయంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు స్పందించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో రాక్షస పాలన అంతమైందని, రామరాజ్యం ప్రారంభమైందని అన్నారు. టీటీడీలో వంశపారంపర్య అర్చకత్వ హక్కును టీడీపీ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. జగన్ అధికారంలోకి వస్తే ఈ హక్కును తిరిగి కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకుంటారని భావిస్తున్నానని అన్నారు. సీఎంగా జగన్ సుదీర్ఘ కాలం పరిపాలన సాగిస్తారని, ఆయన హయాంలో కరవుకాటకాలు ఉండవని అన్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓపై ఆరోపణలు గుప్పించారు. ఏడాదిగా స్వామి వారి కైంకర్యాలకు తాను దూరంగా ఉన్నానని, తిరిగి స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం కలిగించాలని జగన్ కు విజ్ఞప్తి చేశారు.