Arvind Kejriwal: బీజేపీ గాలి బాగా వీచింది... ఈవీఎంలను తప్పుబట్టలేం!: కేజ్రీవాల్
- లోక్ సభ ఎన్నికల్లో పరాజయంపై ఆప్ అంతర్మథనం
- ఢిల్లీలో మూడో స్థానంలో నిలవడంపై ఆవేదన
- పార్టీ అగ్ర నేతలతో కేజ్రీవాల్ భేటీ
ఢిల్లీ శాసన సభలో అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తాజా లోక్ సభ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఢిల్లీ పరిధిలోని 7 లోక్ సభ స్థానాల్లోనూ బీజేపీ పాగా వేసింది. ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ, ఎంపీ స్థానాల్లో విజయ దుందుభిని ఎందుకు మోగించలేకపోయామన్న ఆవేదన ఆప్ నేతల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి కారణాలను సమీక్షించేందుకు ఏర్పాటైన ఈ సమావేశంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆప్ ముఖ్య నేతలు గోపాల్ రాయ్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ ఎన్డీయే విజయం విషయంలో ఈవీఎంలను తప్పుబట్టలేమన్నారు. బీజేపీకి అనుకూల పవనాలు వీచినందువల్లే ఎన్డీయే విజయం సాధించిందన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూలత ఉందనే అంశంపై ఆప్ నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఆప్ ఓటమికి ఫలానావారు బాధ్యులని చెప్పలేమని అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఎన్నికల్లో ఆప్ కేవలం 18 శాతం ఓట్లు సాధించడం ఆ పార్టీ నేతలకు ఆశ్చర్యం కలిగించింది. బీజేపీకి 56 శాతం, కాంగ్రెస్ కు 22 శాతం ఓట్లు లభించగా, తాము మూడో స్థానంలో ఉండటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముగ్గురు ఆప్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోవడం మరింత బాధాకరమని చెబుతున్నారు. తూర్పు ఢిల్లీ లోక్ సభ అభ్యర్థి అతిషికి అతి కష్టం మీద డిపాజిట్ దక్కడంపై చర్చించారు. అతిషిని బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ భారీ మెజారిటీతో ఓడించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ శాసన సభ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఆప్ ముఖ్య నేతలతో ఈ నెల 26న సమావేశమవుతారు.