Ludhiana: ఫీజు కట్టాలంటూ విద్యార్థి చేతి మీద బిల్లును ముద్రించిన స్కూలు యాజమాన్యం
- పంజాబ్ లో ఘటన
- రెండు నెలలకు ఫీజు చెల్లించని బాలుడు
- ఘటనపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి
ఫీజుల విషయంలో కొన్ని ప్రైవేటు స్కూళ్లు ఎంత నిర్దయగా, క్రూరంగా వ్యవహరిస్తాయో చెప్పేందుకు ఈ సంఘటన సరైన ఉదాహరణ! పంజాబ్ లోని లూథియానాలో హర్షదీప్ సింగ్ అనే విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు. స్థానికంగా ముండియాన్ కలాన్ ప్రాంతంలోని ఎస్డీఎన్ స్కూల్లో ఆ బాలుడు విద్యాభ్యాసం సాగిస్తున్నాడు. హర్షదీప్ తల్లిదండ్రులు ఏప్రిల్, మే నెల ఫీజులు చెల్లించలేకపోయారు. దాంతో, ఆ స్కూలు యాజమాన్యం ఫీజు తాలూకు బిల్లును హర్షదీప్ చేతిపై ముద్రించి అతడి తల్లిదండ్రులకు పంపించింది.
హర్షదీప్ ఫీజుతో పాటు అతడి సోదరి బిల్లు కూడా కట్టలేదంటూ అతడి చేతిపై ముద్రించారు. దీనిపై హర్షదీప్ మాట్లాడుతూ, ఓ పరీక్ష రాసేందుకు స్కూలుకు వెళ్లానని, అయితే బ్యాగు తీసుకెళ్లకపోవడంతో, ప్రిన్సిపాల్ ఫీజు స్టాంప్ ను తన చేతిపైనే వేశారని వివరించాడు. హర్షదీప్ తండ్రి కుల్దీప్ సింగ్ ఓ ఆటో డ్రైవర్. దీనిపై ఆయన స్పందిస్తూ ఇది చాలా దారుణం అని వాపోయారు.
మే 25 లోపు ఫీజులు చెల్లిస్తామని చెప్పినా స్కూలు యాజమాన్యం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియడంతో వెంటనే విచారణకు ఆదేశించారు. తప్పు చేసినట్టు తేలితే స్కూలు యాజమాన్యంపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.