Jagan: జగన్ ప్రమాణస్వీకారోత్సవం వివరాలు ఇవిగో!
- ఐదు రకాల పాస్ లు జారీ
- విఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్
- శరవేగంతో సాగుతున్న ఏర్పాట్లు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి వేదికగా నిలుస్తోంది. ఈ మేరకు స్టేడియంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రమాణస్వీకారం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్న తీరును కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, విజిలెన్స్ డీజీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ఎక్కడా భంగం కలగకుండా చూడాలని సీఎస్ ఆదేశాలు జారీచేశారు. కాగా, జగన్ సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి హైదరాబాద్, వైజాగ్, చెన్నై మార్గాల ద్వారా వచ్చే వాహనాలకు కృష్ణా జిల్లా శివారు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ఏఆర్ గ్రౌండ్స్ లో వీఐపీ వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రముఖుల వాహనాల కోసం బిషప్ అజరయ్య స్కూల్, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ కార్యక్రమానికి వచ్చేవారి కోసం ఐదు రకాల పాస్ లు ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చే జనాలను నియంత్రించడం సులువుగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందిరాగాంధీ స్టేడియంలో 35,000 మంది కూర్చుని చూసే వీలుండగా, మరో 20 వేల మంది నిలుచోవచ్చు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని సీఎస్ స్పష్టం చేశారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో స్టేడియంలో భారీ ఏసీ యంత్రాలు, కూలర్లు, ఎక్కడికక్కడ తాగునీటి ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలోపలికి వెళ్లలేని ప్రజల కోసం వెలుపల భారీ ఎల్సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.