RGV: వర్మ గారూ... రద్దీగా ఉండే రోడ్డుపై ప్రెస్ మీట్ వద్దు, మరెక్కడైనా పెట్టుకోండి: విజయవాడ పోలీసులు
- పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెడతానంటూ వర్మ ట్వీట్
- పలు సెక్షన్లు అమలులో ఉన్నాయన్న బెజవాడ పోలీస్
- వెనక్కి తగ్గిన వర్మ
ఎన్నికల వేళ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కోసం విజయవాడ పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెట్టేందుకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి రిలీజ్ డేట్ ప్రకటించిన వర్మ మరోసారి విజయవాడలోని పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెడతానంటూ ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలో, విజయవాడ పోలీసులు రద్దీగా ఉండే రోడ్డులో ప్రెస్ మీట్ పెడితే అత్యవసర సర్వీసులకు విఘాతం కలిగే అవకాశం ఉందని, ఏదైనా హాల్ లో కానీ, ఏదైనా ప్రెస్ క్లబ్ లో కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విజయవాడలో ప్రస్తుతం సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని, దానికితోడు ఎన్నికల కోడ్ ఇంకా ముగియలేదని వర్మకు వివరించారు. పైపుల రోడ్డులో ఉన్న కొన్ని కాలేజీలు, స్కూళ్లలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల నడుమ బహిరంగ ప్రదేశంలో కార్యక్రమాలకు తాము అనుమతించలేమని, వర్మ తన ప్రెస్ మీట్ పై మరోసారి ఆలోచించుకోవాలని విజయవాడ నార్త్ ఏసీపీ రమేశ్ స్పష్టం చేశారు.
అటు, వర్మ కూడా తన ప్రెస్ మీట్ పై వెనక్కితగ్గినట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం నాలుగింటికి గాంధీ నగర్ లోని ఫిలిం చాంబర్ లో మీడియా సమావేశం ఉంటుందని ట్వీట్ చేశారు. ఎండల తీవ్రత, కొన్ని ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ముంబయి నుంచి స్పైస్ జెట్ విమానంలో విజయవాడ వస్తున్నానని, జగన్ పోలీసులు తనతో చంద్రబాబు పోలీసుల కంటే మెరుగైన రీతిలో వ్యవహరిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.