Chandrababu: 'నారా' అంటే ఏంటో మోదీ బాగా చెప్పారు: మంచు విష్ణు
- నారా పదంలోని అక్షరాలకు భాష్యం
- ప్రధాని ట్వీట్ ను ప్రస్తావించిన మంచువారబ్బాయి
- చంద్రబాబుపై సెటైర్!
వైసీపీ ఘనవిజయంతో ఏపీ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైందని జగన్ మద్దతుదారులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు, లోక్ సభ ఎన్నికల్లో 22 సీట్లు గెలవడం ద్వారా వైసీపీ సృష్టించిన ప్రభంజనం జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో, దారుణ పరాజయంపాలైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కువవయ్యాయి. తాజాగా, టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా సెటైర్ వేశారు. ఇటీవల మోదీ చేసిన ఓ ట్వీట్ ను ఉటంకిస్తూ చంద్రబాబుపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
'నారా' అనే పదంలోని 'ఎన్' అంటే నేషనల్, 'ఏ' అంటే యాంబిషన్, 'ఆర్' అంటే రీజనల్, 'ఏ' అంటే ఆస్పిరేషన్స్... 'జాతీయ స్థాయిలో ఆశయం, ప్రాంతీయ స్థాయిలోనే ఆకాంక్షలు' అంటూ ఇలా ప్రధాని ఎవర్ని ట్రోల్ చేశాడో మనందరికీ బాగా తెలుసులెండి అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. మంచు విష్ణు కుటుంబీకులు చాన్నాళ్లుగా చంద్రబాబును వ్యతిరేకిస్తుండడంతోపాటు జగన్ కు బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. మంచు విష్ణు పెళ్లాడింది కూడా జగన్ చిన్నాన్న కుమార్తెనే అన్న సంగతి తెలిసిందే.