Andhra Pradesh: ‘కేరళ ఫార్ములా’ను అమలుచేస్తే మరో 30 ఏళ్లు జగనే ముఖ్యమంత్రి!: ఉండవల్లి అరుణ్ కుమార్
- పోలవరంపై జ్యుడీషియల్ బాడీని స్వాగతిస్తున్నాం
- కేసీఆర్ తో సఖ్యతగా ఉంటే ఏపీకే మంచిది
- వాన్ పిక్ తో నెల్లూరు, ప్రకాశంలో నిరుద్యోగులే ఉండరు
పోలవరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ బాడీని ఏర్పాటు చేస్తానని వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం జగన్ ప్రకటించడం నిజంగా స్వాగతించదగ్గ పరిణామమని లోక్ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. పోలవరం విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. గతంలో వైఎస్ ఎవరిని సంప్రదించారో, వారి సలహా-సహకారాలతోనే జగన్ ముందుకు వెళ్లాలని కోరారు. రాజమండ్రిలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తో సఖ్యతగా ఉంటే ఏపీకే మంచిదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో చెప్పినట్లు ఏపీకి ఇంకా రూ.23,000 కోట్లు రాలేదన్నారు. వాన్ పిక్ అన్నది వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నిరుద్యోగం అన్నది ఉండదని తేల్చిచెప్పారు.
కేరళలో అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను జగన్ అమలుచేస్తే మరో 30 ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని ఉండవల్లి జోస్యం చెప్పారు. జగన్ పై రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలను ప్రజలు ఒప్పుకోలేదనీ, ఏడాది పాటు అసెంబ్లీకి వెళ్లకపోయినా భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు.