Gujarath: నిరాహార దీక్షకు సిద్ధమైన హార్దిక్ పటేల్... అదుపులోకి తీసుకున్న గుజరాత్ పోలీసులు
- సూరత్ కోచింగ్ సెంటర్ ఘటనపై హార్దిక్ ఆందోళన
- అడ్డుకున్న పోలీసులు
- హార్దిక్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన సూరత్ సీపీ
సూరత్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగి 22 మంది మరణించిన సంఘటనపై నిరాహార దీక్ష చేస్తానంటూ హెచ్చరించిన పాటిదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ ను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదం ఘటనపై సూరత్ మేయర్, ఇతర అధికారులపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ హార్దిక్ పటేల్ డిమాండ్ చేశారు. ఘటన స్థలం వద్దే ఆందోళనకు దిగుతానంటూ అనుమతి కోరగా, పోలీసులు తిరస్కరించారు. అదే స్థలంలో నిరాహార దీక్షకు దిగేందుకు ఈ కాంగ్రెస్ నేత సిద్ధమవడంతో పోలీసులు వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సూరత్ పోలీస్ కమిషనర్ సతీశ్ శర్మ వివరాలు తెలిపారు.
కాగా, కోచింగ్ సెంటర్ ఘటన స్థలాన్ని మొదట ఓసారి హార్దిక్ సందర్శించగా, ఆ సమయంలో అతడిపై ప్రత్యర్థులు దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతడిని మరోసారి అక్కడికి వెళ్లవద్దంటూ స్పష్టం చేశారు. ఇది హార్దిక్ పటేల్ భద్రతకు సంబంధించిన విషయం అని, ప్రతి రోజూ అక్కడికి వెళతానంటే ఎలా? అని సతీశ్ శర్మ అసహనం వ్యక్తం చేశారు.