Odisha: 18 ఏళ్ల తర్వాత కొడుకుతో కలిసి ‘పది’ పరీక్షలు.. ఉత్తీర్ణురాలై కంటతడి!
- అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న మహిళ
- 18 ఏళ్ల క్రితం చదువును ఆపేసిన వైనం
- ‘పది’ పరీక్షల్లో పాసైన ఆనందంలో కన్నీళ్లు
చదువుకోవాలన్న తపన ఉండాలే కానీ వయసు అడ్డం కాదని నిరూపించిందో తల్లి. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం విడిచిపెట్టిన పుస్తకాలను మళ్లీ చేతబట్టింది. కొడుకుతో కలిసి పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో జరిగిన ఈఘటన ఎందరో మహిళలకు స్ఫూర్తికానుందనడంలో సందేహం లేదు. కర్లకోట గ్రామ పంచాయతీకి చెందిన బసంతి ముదులి (36) గ్రామంలో అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది.
వివాహం తర్వాత తన చదువుకు స్వస్తి చెప్పిన ఆమె వారం క్రితం పదో తరగతి పాసైన ఆనందంలో కన్నీరు పెట్టుకుంది. ఒడిశా స్టేట్ ఓపెన్ స్కూలు నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో పాసైన ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెట్రిక్యులేషన్ లేకుంటే ఉద్యోగంలో ముందుకెళ్లలేమని, ప్రమోషన్లు రావని భావించిన బసంతి కుమారుడు శివానందతో కలిసి పదో తరగతి పరీక్షలు రాసింది. అతడు కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు.
చదువు విషయంలో భర్త లాబా పట్నాయక్, కుమారుడు తనకు సహకరించారని బసంతి పేర్కొంది. పదో తరగతి పరీక్షల్లో బసంతికి 203 మార్కులు వచ్చి డి-గ్రేడ్లో పాస్ కాగా, 340 మార్కులు సాధించిన కుమారుడు శివానంద సి-గ్రేడ్లో పాసయ్యాడు.