teja: నా హీరోలో నేను పరిశీలించేవి ఇవే: దర్శకుడు తేజ
- కథలో పాత్రను బట్టే హీరోను తీసుకుంటాను
- నటించడం వచ్చా? లేదా? చూసుకుంటాను
- నేను చెప్పింది చేస్తాడా అని ఆలోచిస్తాను
విభిన్నమైన కథాకథనాలతో తేజ తన సినిమాలను తెరకెక్కిస్తూ వుంటారు. హీరోలను ఆయన ఎంతో విలక్షణంగా .. సహజత్వానికి దగ్గరగా చూపిస్తూ వుంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "నా సినిమాకి కావలసిన హీరోలో నేను మూడు విషయాలను పరిశీలిస్తాను.
నా కథలో నాయకుడికి అవసరమైన స్ట్రక్చర్ ఆ వ్యక్తికి ఉందా? లేదా? చూస్తాను. నేను ఇచ్చే పాత్రలో నటించగలడా? లేదా? అని చూస్తాను. నేను చెప్పినట్టు చేస్తాడా? లేదా? అని ఆలోచిస్తాను. ఎందుకంటే చాలామంది నటీనటులు మనం చెప్పింది చేయరు. 'నిజం' సినిమాలో ఒక పెద్ద యాక్టర్ ను పెట్టుకున్నాను. ఎన్ని టేకులు చేసినా .. నేను చెప్పినట్టు చేయడు .. తను అనుకున్నదే చేస్తున్నాడు. ఇండస్ట్రీలో వున్న వాళ్లంతా ఆయన గొప్ప నటుడు అంటారు. 14 టేకులు తీసుకున్న తరువాత ఇక నేను చేయను అని చెప్పేశాను. అందువలన నేను చెప్పింది చేస్తాడా అనే విషయంలో క్లారిటీ తీసుకుంటాను" అని చెప్పుకొచ్చారు.