Ayyanna Patrudu: ఎన్నికల్లో ఏదో జరిగింది.. లేకపోతే ఇంత ఘోరంగా ఓడిపోం: అయ్యన్నపాత్రుడు
- కనీసం 50-60 సీట్లు అయినా రావాలి
- దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత ఉన్నా 300కు పైగా సీట్లు వచ్చాయి
- తెలంగాణలో బీజేపీ 4 చోట్ల గెలవడం ఏంటి?
రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసిన టీడీపీకి కనీసం 50-60 సీట్లు అయినా రావాలని, కానీ ఇంత ఘోరమైన పరిస్థితి చూస్తుంటే ఎక్కడో ఏదో జరిగిందని అనిపిస్తోందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అనుమానం వ్యక్తం చేశారు. తాను ఒక్కడినే కాదని, ప్రతి ఒక్కరు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మంగళవారం నర్సీపట్నంలో జరిగిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆవేదనను చూసి తట్టుకోలేకపోయానని అన్నారు.
తెలంగాణలో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలుపొందడంపై అయ్యన్నపాత్రుడు విస్మయం వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపొందిన ఆ నాలుగు స్థానాల్లో ఆ పార్టీకి కరపత్రాలు పంచేందుకు కూడా ఎవరూ లేరని, అటువంటి చోట్ల బీజేపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. బీజేపీపై దేశవ్యాప్తంగా ఇంత వ్యతిరేకత ఉంటే ఆ పార్టీకి 300కు పైగా సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. చూస్తుంటే అనుమానంగా ఉందని అయ్యన్నపాత్రుడు అన్నారు.