BJP: మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఆహ్వానం
- పశ్చిమబెంగాల్ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన పలువురు
- ఎంపీలు, ఎమ్మెల్యేలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులతోపాటు సముచిత స్థానం
- ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినట్లు బీజేపీ వర్గాల సమాచారం
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రాణత్యాగం చేసిన కుటుంబాలకు సముచిత గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగాను, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ పశ్చిమబెంగాల్లో జరిగిన ఘర్షణల్లో పలువురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారు.
ఇలా ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఉత్సవానికి హాజరవుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులతోపాటు వారికి సముచిత స్థానం కల్పించారు. ఇప్పటికే ఆయా కార్యకర్తల కుటుంబాలకు ఆహ్వాన పత్రాలు పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మంగళవారం రాత్రి మోదీ, పార్టీ చీఫ్ అమిత్షా ఆధ్వర్యంలో జరిగిన సుదీర్ఘ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసా ఇచ్చేందుకే ఈ ఆహ్వానం పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీరిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.