CPI: వామపక్షాల ఓటమి దేశానికి ప్రమాదకరం: సురవరం సుధాకర్ రెడ్డి

  • ప్రజలు జాతీయవాదం వైపు మొగ్గుచూపారు
  • విపక్షాల ఓటమికి కాంగ్రెస్ వైఫల్యమే కారణం
  • ఏపీలో జగన్ సుపరిపాలన అందించాలి

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. తాజాగా ముగిసిన ఎన్నికలపై ఆయన స్పందించారు. సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలు దారుణ పరాజయాలు చవిచూడడం పట్ల సురవరం ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్షాల ఓటమి దేశానికి ప్రమాదకరం అని అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు జాతీయవాదం, భావోద్వేగాల వైపు మొగ్గుచూపారని విశ్లేషించారు. అయితే, దేశంలో లౌకికవాద, ప్రజాస్వామ్య శక్తులు బలహీనపడడం ఆందోళనకు గురిచేసే అంశం అని అన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలే కారణమని సురవరం సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. తమిళనాడులో విపక్షాలన్నీ ఏకమై ఘనవిజయం సాధించాయని పేర్కొన్నారు.

కాగా, సోమ, మంగళవారాల్లో నిర్వహించిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా, తాను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తలను సురవరం ఖండించారు. మరోపక్క, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ ఏపీలో సుపరిపాలన అందిస్తారని కోరుకుంటున్నట్టు చెప్పారు.

CPI
  • Loading...

More Telugu News