New Delhi: మోదీ ప్రమాణ స్వీకారం... జగన్ హాజరయ్యే అంశంపై సందిగ్ధత!
- నేటి రాత్రి మోదీ ప్రమాణ స్వీకారం
- విచ్చేస్తున్న దేశవిదేశీ అతిథులు
- ఎయిర్ పోర్టులో ట్రాఫిక్ రద్దీ
నేటి రాత్రి న్యూఢిల్లీలో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా, ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత, మరికాసేపట్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారా? లేదా? అనే సందిగ్ధత నెలకొనివుంది. జగన్ ప్రమాణ స్వీకార సభ ముగిసేసరికి 1.15 నిమిషాల సమయం అవుతుందని అంచనా.
మోదీ ప్రమాణ స్వీకారానికి దేశవిదేశాల నుంచి వందలాది మంది అతిథులు వస్తుండటంతో, ఢిల్లీలోని ఎయిర్ పోర్టులో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఢిల్లీకి రావాలంటే, కనీసం మధ్యాహ్నం 3.30 గంటల్లోపే ఢిల్లీలో దిగేలా రావాలని అక్కడి అధికారుల నుంచి ఏపీ అధికారులకు సమాచారం అందింది. విజయవాడ నుంచి ఢిల్లీకి సుమారు రెండున్నర గంటల వరకూ సమయం పడుతుంది. ఎంత త్వరగా బయలుదేరినా అధికారులు చెప్పిన సమయానికి జగన్ విమానం చేరుకునేది కష్టమే. ఇక సకాలంలో జగన్ చేరగలుగుతారా? అన్న సందిగ్ధతతో ఉన్న అధికారులు, ఇంకా జగన్ ప్రయాణాన్ని ఖరారు చేయలేదు.
ఢిల్లీలో జగన్ విమానం ల్యాండ్ అయ్యేందుకు కొంత అదనపు సమయాన్ని కోరామని, ఎయిర్ పోర్టు అధికారుల నుంచి సమాధానం కోసం చూస్తున్నామని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. అదనపు సమయం లభించగానే, జగన్ ప్రయాణం ఖరారవుతుందని తెలిపాయి.