Tamilnadu: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. 17 మందిని నిలువునా ముంచిన కిలేడీ కోసం పోలీసుల వేట!
- మ్యాట్రిమోనియల్ సైట్లను చూసి మోసం
- దగ్గరై, డబ్బు గుంజి దూరమయ్యే యువతి
- త్వరలోనే అరెస్ట్ చేస్తామన్న పోలీసులు
వివాహానికి సిద్ధమవుతున్న యువకులే ఆమె టార్గెట్. మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లను వెతుకుతూ, యువకులను పరిచయం చేసుకోవడం, పెళ్లి చేసుకుందామని చెప్పడం, ఆపై వారు నమ్మారని తెలుసుకున్నాక, కష్టాల కథలు చెప్పి, దొరికినంత కాజేసి ముఖం చాటేయడం ఆమె పని. ఒకరు, ఇద్దరు కాదు.. ఆమె బారిన 17 మంది పడ్డారు. ఇప్పుడీ కిలేడీ కోసం తమిళనాడు పోలీసులు వేట ప్రారంభించారు.
తమిళనాడులోని కడలూరు జిల్లాకు చెందిన బాలమురుగన్ అనే బంగారు వ్యాపారి, ఎంబీఏ చేసిన తరువాత వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఓ మాట్రిమోనియల్ వెబ్ సైట్ లో పేరు, వివరాలు నమోదు చేసుకున్నాడు. అతనికి సేలం జిల్లా ఆట్టయంపట్టికి చెందిన 25 ఏళ్ల యువతి అదే వెబ్ సైట్ లో పరిచయం అయింది. పరిచయాన్ని సన్నిహిత సంబంధంగా మార్చుకుని, పెళ్లి చేసుకుందామని నమ్మించింది.
ఆపై తన కుటుంబ కష్టాలు చెప్పింది, అవసరానికి ఆదుకోవాలని వాపోతూ, రూ. 23 లక్షల వరకూ నొక్కేసింది. ఆపై క్రమంగా అతన్ని దూరం పెట్టింది. అనుమానం వచ్చిన బాలమురుగన్, యువతి ఇంటికి వెళ్లి, ఆమె సెల్ ఫోన్ ను పరిశీలించగా చాలామంది యువకులతో అత్యంత సన్నిహితంగా తానున్న ఫొటోలు, అసభ్యంగా తీసుకున్న సెల్ఫీలు చూశాడు. వాటితో పాటు ప్రేమ ముసుగేసుకుని ఆమె చేస్తున్న అసభ్య చాటింగులు, ఎస్ఎంఎస్లు చదివి, తాను అడ్డంగా మోసపోయినట్టు గ్రహించాడు.
దీంతో బాలమురుగన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, విచారణ ప్రారంభించగా, ఆమె వెంటనే ఇంటి నుంచి పారిపోయింది. పోలీసుల విచారణలో ఆ యువతి కోయంబత్తూరు, చెన్నై, మధురై తదితర ప్రాంతాలకు చెందిన వారిని ఇదే తరహాలో 17 మందిని నమ్మించి, మోసగించిందని తేల్చారు. ఆమెను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.