IT: టెక్కీలకు శుభవార్త... ఐటీ రంగంలో ఊపందుకున్న నియామకాలు!
- కొత్తగా ఉద్యోగాలు ఇవ్వనున్న గోల్డ్ మన్ శాక్స్
- అదే దారిలో మరిన్ని మల్టీ నేషనల్ కంపెనీలు
- యువతకు దగ్గరవుతున్న ఉపాధి అవకాశాలు
గడచిన రెండేళ్లుగా ఐటీ కంపెనీలో కనిపించిన మాంద్యం క్రమంగా కనుమరుగవుతోంది. పలు ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమిస్తున్నాయి. మరిన్ని కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే ఏర్పాట్లలో ఉండటంతో యువతకు ఉపాధి అవకాశాలు మరింత దగ్గరవుతున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలు సైతం నూతన సాంకేతిక నిపుణులను రిక్రూట్ చేసుకునే ఆలోచనలో ఉన్నాయి.
ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా సేవలందిస్తున్న గోల్డ్ మాన్ శాక్స్, తన బెంగళూర్ సెంటర్ లో ఇంజనీరింగ్ ఉద్యోగులను భారీగా పెంచుకోవాలని నిర్ణయించింది. 2004లో భారత్ లో కాలుమోపిన సంస్థ, తొలి ఏడాదిలో 290 మంది ఉద్యోగులతో ప్రారంభం కాగా, ఇప్పుడా సంస్థలో 5 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇండియాలో ప్రతియేటా 24 శాతం అభివృద్ధి గణాంకాలను నమోదు చేస్తున్నామని, క్యాంపస్ నియామకాలను 20 శాతం పెంచామని సంస్థ సేవా విభాగం భారత్ హెడ్ గుంజన్ సంతానీ వెల్లడించారు.
తమ విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఉద్యోగాల నియామకాలు ఉంటాయని అన్నారు. బెంగళూరు సెంటర్ కేవలం ఇంజనీరింగ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఆటోమేషన్, డిజిటైజేషన్ బిజినెస్ ను కూడా అందిస్తుందని అన్నారు. గోల్డ్ మన్ శాక్స్ దారిలోనే మరిన్ని మల్టీ నేషనల్ కంపెనీలు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి.