Cricket: పాకిస్థాన్ కు దారుణ పరాభవం... విండీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి
- స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన వెస్టిండీస్
- గేల్ హాఫ్ సెంచరీ
- పూరన్ మెరుపుదాడి
ఐసీసీ క్రికెట్ కప్ లో పాకిస్థాన్ తన ప్రస్థానాన్ని దారుణ పరాజయంతో ఆరంభించింది. నాటింగ్ హామ్ లో ఇవాళ వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టి20 మ్యాచ్ ను తలపించిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 21.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది.
స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ కు హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ తనదైన శైలిలో శుభారంభాన్నిచ్చాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అవుటైనా, అప్పటికే సగం పని పూర్తిచేశాడు. గేల్ 34 బంతుల్లో 50 పరుగులు చేశాడు. గేల్ స్కోరులో 6 ఫోర్లు, 3 సిక్స్ లున్నాయి. ఆ తర్వాత వచ్చిన నికోలాస్ పూరన్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టి పాకిస్థాన్ కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను లాగేసుకున్నాడు. దాంతో 13.4 ఓవర్లలోనే కరీబియన్లు విజయతీరాలకు చేరారు. పూరన్ చివర్లో సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు.
విండీస్ కోల్పోయిన 3 వికెట్లు మహ్మద్ అమీర్ ఖాతాలో చేరాయి. కాగా, పాకిస్థాన్ ను నిప్పులు చెరిగే బంతులతో కుప్పకూల్చిన యువ బౌలర్ ఒషేన్ థామస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.