Jagadeeswar: కానిస్టేబుల్ లక్ష్మణ్ క్షేమంగా ఉన్నాడు.. ఎలాగైనా వెదికి తీసుకొస్తాం: బాచుపల్లి పోలీసులు
- మూడు రోజుల సెలవుపై వెళ్లాడు
- 28న ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్టు మెసేజ్
- లక్ష్మణ్ వాట్సాప్ ద్వారా లైవ్‌లోకి వచ్చాడు
తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కుటుంబ సభ్యులకు ఓ కానిస్టేబుల్ మెసేజ్ పెట్టడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ముంబయి నుంచి సికింద్రాబాద్ వచ్చేందుకు కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎక్కిన మేడ్చల్ కానిస్టేబుల్ లక్ష్మణ్ మధ్యలోనే దిగిపోయాడు. అనంతరం తన కుటుంబ సభ్యులకు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ మెసేజ్ పెట్టాడు. దీంతో లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
లక్ష్మణ్ గత 8 నెలలుగా బాచుపల్లి సీఐకి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లక్ష్మణ్ విషయమై స్పందించిన సీఐ తన వద్ద అతనికి ఎలాంటి పని ఒత్తిడి లేదని తెలిపారు. తన కుటుంబ సభ్యులకు డబ్బులు ఇవ్వాలంటూ తనకు మెసేజ్ పెట్టాడని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బాచుపల్లి ఎస్‌హెచ్‌వో జగదీశ్వర్ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ, లక్ష్మణ్ ఈ నెల 27 కంటే ముందే మూడు రోజుల సెలవుపై ఊరెళ్లాడని, 28న డ్యూటీ చేసి ఈరోజు అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్టు మెసేజ్ చేశాడని తెలిపారు. దీంతో లక్ష్మణ్ కుటుంబ సభ్యులు తమకు సమాచారం అందివ్వడంతో వెంటనే అతను ఉన్న ప్రాంతానికి వెళితే అతను దొరకలేదన్నారు. లక్ష్మణ్ వాట్సాప్ ద్వారా లైవ్‌లోకి వచ్చాడని, క్షేమంగా ఉన్నాడని జగదీశ్వర్ తెలిపారు. లక్ష్మణ్‌ను క్షేమంగా వెదికి తీసుకొస్తామన్నారు.