Andhra Pradesh: లోక్ సభ ఎన్నికల్లో సీనియర్ల ఓటమి.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ భావోద్వేగం!
- మన పార్టీకి 52 మంది ఎంపీలు ఉన్నారు
- బీజేపీపై రోజూ పోరాడుదాం
- కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు రాహుల్ దిశానిర్దేశం
కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో 52 మంది సభ్యులు ఉన్నారనీ, వీరి సాయంతో బీజేపీపై రోజూ పోరాడుతామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. లోక్ సభకు నూతనంగా ఎన్నికైన 51 మంది సభ్యులతో రాహుల్ ఈరోజు ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మీరు ప్రతీ భారతీయుడి తరఫున పోరాడుతున్నారు. ద్వేషం, పిరికితనం, ఆగ్రహం మీకు వ్యతిరేకంగా ఉన్నాయి’ అని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, దేవెగౌడ, మిత్రుడు జ్యోతిరాదిత్య సింధియా ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూడటంపై రాహుల్ విచారం వ్యక్తం చేశారు. ‘పార్టీ సీనియర్లు, పాతముఖాలు ఇక్కడ ఉండి ఉంటే మరింత సంతోషించేవాడిని’ అని భావోద్వేగానికి లోనయ్యారు. ఏదేమయినా కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించగా, సీడబ్ల్యూసీ దానిని ఏకగ్రీవంగా తిరస్కరించింది.