Andhra Pradesh: చంద్రబాబు సంసారం కోసం కూడా సమయం కేటాయించకుండా కష్టపడ్డారు.. అయినా ఓడించారు!: జలీల్ ఖాన్ ఆవేదన
- ఏపీ ప్రజలు ఎందుకో మార్పును కోరుకున్నారు
- స్వతంత్ర అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు టీడీపీని దెబ్బతీశారు
- విజయవాడలో మీడియాతో టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అప్పటి సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమించారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలిపారు. ఏపీ కోసం రాత్రీపగలు తేడా లేకుండా సంసారం కోసం కూడా సమయం కేటాయించకుండా కష్టపడ్డారని ప్రశంసించారు. తక్కువ సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు ఎక్కువ అభివృద్ధిని చేసి చూపారని అన్నారు. అయినా ప్రజలు ఎందుకో మార్పును కోరుకున్నారని చెప్పారు. టీడీపీకి విజయవాడ పశ్చిమంలో 51,000 ఓట్లు వచ్చాయనీ, నువ్వా?నేనా? అన్నట్లు ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు.
స్వతంత్ర అభ్యర్థులు, జనసేన అభ్యర్థుల వల్ల టీడీపీకి లాభం జరుగుతుందని భావించామనీ, కానీ టీడీపీకి నష్టం జరిగిందని తెలిపారు. ఏపీ ప్రజలకు మంచి పరిపాలన అందించాలని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు ఇంత కష్టపడి అభివృద్ధి చేసినా ప్రజలు టీడీపీని ఓడించడం చాలా ఆవేదనగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో నగదు వరదై పారిందనీ, నగదు రేస్ జరిగిందని విమర్శించారు.