Uttar Pradesh: పోలీసుల నుంచి తప్పించుకున్న స్మగ్లర్.. పరోటాల కోసం వెళ్లి దొరికిపోయాడు!
- యూపీలోని ఘజియాబాద్ లో ఘటన
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిన రింకూ
- కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళుతుండగా పరారీ
భారీగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన ఓ నిందితుడు, పోలీసులు నిద్రపోతుండగా తప్పించుకున్నాడు. అనంతరం ఏకధాటిగా వందల కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే భోజనానికి వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో గత నెల 27న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యూపీలోని మౌలో గంజాయి తరలిస్తూ రింకూ యాదవ్(26) అనే వ్యక్తి దొరికిపోయాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఔరియా కోర్టులో హాజరుపర్చేందుకు రైలులో బయలుదేరారు. అయితే రైలులో పోలీసులు నిద్రలోకి జారుకోగా, రింకూ తప్పించుకున్నాడు. అనంతరం ఏకధాటిగా 750 కిలోమీటర్లు ప్రయాణించాడు. రింకూ పరారు కావడంతో అతడిని తీసుకెళుతున్న ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు.
ఈ నేపథ్యంలో గంజాయి బిజినెస్ లో ఉన్న పాత మిత్రులను కలుసుకునేందుకు రింకూ ఘజియాబాద్ కు వచ్చాడు. అతడిని కలిసి వెళ్లిపోకుండా స్థానికంగా పరోటాలకు ఫేమస్ అయిన డాబాలో దూరాడు. అక్కడే ఉన్న ఓ పోలీస్ ఇన్ఫార్మర్ రింకూను గుర్తించి పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. అయితే పోలీసులు వచ్చేలోగా భోజనం పూర్తిచేసిన రింకూ తిరిగి కారులో వెళ్లడం మొదలుపెట్టాడు. దీంతో అతడిని వెంబడించిన పోలీసులు.. ఓ పెట్రోల్ బంకు వద్ద అదుపులోకి తీసుకున్నారు.