Russia: పొట్టి గౌనులు ధరించి ఫుల్ మేకప్ తో వస్తే బోనస్... మహిళా ఉద్యోగులకు రష్యా కంపెనీ ఆఫర్
- అల్యూమినియం కంపెనీ వినూత్న ప్రతిపాదన
- విమర్శల తాకిడి
- నెటిజన్ల మండిపాటు
రష్యాలో టాట్ ప్రూఫ్ అనే అల్యూమినియం తయారీ సంస్థ తీవ్రస్థాయిలో విమర్శలపాలవుతోంది. 2014లో రష్యాలో నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్ కు అల్యూమినియం ఉపకరణాలు సమకూర్చింది ఈ సంస్థే. అయితే, టాట్ ప్రూఫ్ తమ కార్యాలయాల్లో ఫెమినిటీ మారథాన్ అని మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. ఇది నెలరోజుల ఈవెంట్. ఇందులో భాగంగా మహిళా ఉద్యోగులు మోకాళ్లపైకి ఉండేలా స్కర్టులు ధరించి, ఫుల్ మేకప్ తో వస్తే వారికి రోజుకు 100 రూబుళ్లు (భారత కరెన్సీలో రూ.107) బోనస్ గా ఇస్తామని టాట్ ఫ్రూఫ్ యాజమాన్యం ప్రకటించింది.
ఈ ఆఫర్ అంగీకరించే మహిళలు ఓ ప్రత్యేక నంబర్ కు తమ ఫొటోలను పంపాల్సి ఉంటుంది. కానీ, ఈ ఆఫర్ పై రష్యాలో మహిళా సంఘాలు, నెటిజన్ల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తోంది. మహిళా ఉద్యోగులు కాదు యాజమాన్యమే మేకప్ వేసుకుని రావాలని ఓ నెటిజన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడున్నాం మనం, మధ్యయుగంలో కాదు కదా! అంటూ మరో వ్యక్తి స్పందించారు.