kcr: కేసీఆర్ మంచి పనులు చేస్తున్నారంటూ బీజేపీపై ఫైర్ అయిన ఒవైసీ
- హైదరాబాద్ ఎదగడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదు
- ఉత్తరప్రదేశ్ ను ఉగ్రవాదుల అడ్డాగా చెప్పగలరా?
- ఆరెస్సెస్, బీజేపీ ఇక్కడ గెలవలేవు
హైదరాబాద్ ఉగ్రవాదులకు సేఫ్ జోన్ గా మారిందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత ఒవైసీ మండిపడ్డారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని... ఆయనకు హైదరాబాద్ ఎదగడం ఇష్టం లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఐసిస్ సభ్యులు ఎక్కువగా పట్టుబడ్డారని... ఆ రాష్ట్రాన్ని ఉగ్రవాదుల అడ్డాగా చెప్పగలరా? అని ప్రశ్నించారు. 300 సీట్లు వచ్చినంత మాత్రాన ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా చేయాలనుకుంటున్నారా? అని అడిగారు.
గత మోదీ ప్రభుత్వ హయాంలోనే మూకదాడులు, దళితులపై దాడులు, ఘర్ వాపసీ, లవ్ జీహాద్ వంటివి మొదలయ్యాయని ఒవైసీ అన్నారు. మోదీ, కిషన్ రెడ్డి, గిరిరాజ్ సింగ్, బాబా రాందేవ్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతారని... వీహెచ్పీ మరో విధంగా మాట్లాడుతుందని... గందరగోళం సృష్టించడానికి ఇదొక వ్యూహమని విమర్శించారు. అసలైన సమస్యలను ప్రజలు చూడకుండా చేసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేస్తున్నారని కితాబిచ్చారు. హైదరాబాదులో భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్మే సంస్కృతి ఉందని... ఇక్కడ ఆరెస్సెస్, బీజేపీ గెలవలేవని అన్నారు.