saree: భారత్ నుంచి చీర మాయమవుతోంది.. నటి, ఎంపీ మిమి చక్రవర్తి ఫొటోపై బీబీసీ మాజీ జర్నలిస్ట్
- నటి, ఎంపీ మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ ఫొటో పోస్టు చేసిన అహ్మద్
- భవిష్యత్ తరాలు చీరను పెళ్లిలో మాత్రమే ధరిస్తాయని ట్వీట్
- విరుచుకుపడుతున్న నెటిజన్లు
భారత్ అనగానే తొలుత గుర్తొచ్చేది చీరే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మహిళలు చీరకట్టుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. దేశ సంస్కృతీ సంప్రదాయంలో భాగమైన ఈ చీర త్వరలోనే దేశం నుంచి మాయం కాబోతుందంటూ బీబీసీ మాజీ జర్నలిస్ట్ తుఫైల్ అహ్మద్ చేసిన ట్వీట్‌పై విమర్శల వాన కురుస్తోంది.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన నటి మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్‌లు పార్లమెంటు ఎదుట ప్యాంటు, షర్టు ధరించి ఉన్న ఫొటోను ట్వీట్ చేసిన అహ్మద్.. ‘‘భారత్ నుంచి చీర కనుమరుగవుతోంది. తర్వాతి తరం వారు చీరను పెళ్లిళ్లు, ఫంక్షన్లలో మాత్రమే ధరిస్తారు. చీరలు ధరించి కార్యాలయాలకు వచ్చే మహిళలను, చీరలు ధరించి బయటకు వచ్చే మహిళలను నేనైతే చూడలేదు’’ అని ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ తప్ప ఈ తరం హీరోయిన్లు ఎవరూ చీరను ధరించడం లేదని పేర్కొన్నారు.
అహ్మద్ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చీరపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలని, మహిళల అభిప్రాయాలను గౌరవించాలని కోరారు. నిజానికి చీర ఇప్పుడు మళ్లీ ఫ్యాషన్ రంగంలో కాలుమోపిన విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. కొందరేమో తొలుత మీ మహిళల బురఖాపై దృష్టి సారించాలని ఘాటు కౌంటర్ ఇచ్చారు. చీర మాయమవుతోందన్న వార్త పచ్చి అబద్ధమని, గత మూడు నెలల్లో తన భార్య తనతో ఏకంగా 12 చీరలు కొనిపించిందని ఓ నెటిజన్ నవ్వుతెప్పించే కామెంట్ చేశాడు.