India: హిందూస్థాన్ యూనీలీవర్ చేతికి హార్లిక్స్, బూస్ట్!
- ఈ రెండు బ్రాండ్ల విలువ రూ.27,750 కోట్లు
- జీఎస్కే విలీనానికి అనుమతించిన వాటాదార్లు
- హిందూస్థాన్ యూనీలీవర్ కు తొలగిన అడ్డంకి
హార్లిక్స్, బూస్ట్ బ్రాండ్లు భారతీయులతో కొన్ని దశాబ్దాలుగా పెనవేసుకునిపోయాయి. ఈ రెండు బ్రాండ్ల సొంతదారైన జీఎస్కే కన్సూమర్స్ హెల్త్ కేర్ తీసుకున్న నిర్ణయంతో ఇకమీదట హార్లిక్స్, బూస్ట్ హిందూస్థాన్ యూనీలీవర్ చేతుల్లోకి వెళతాయి. ఈ మేరకు గ్లాక్సో స్మిత్ క్లైన్ (జీఎస్కే) ఓ ప్రకటన చేసింది. హార్లిక్స్, బూస్ట్ బ్రాండ్ల విలువ ప్రస్తుత మార్కెట్ ను బట్టి రూ.27,750 కోట్లుగా చెప్పుకోవచ్చు.
కొంతకాలం కిందట హిందూస్థాన్ యూనీలీవర్ లో జీఎస్కే విలీనం ప్రతిపాదన వచ్చింది. అయితే, ఇన్నాళ్లూ జీఎస్కే వాటాదారుల నుంచి విలీనానికి అనుమతి లభించలేదు. అయితే, ఇప్పుడు జీఎస్కే వాటాదారుల మధ్య ఓటింగ్ నిర్వహించగా, 99.99 శాతం మంది విలీనానికి మద్దతుగా ఓటు వేశారు. దాంతో, హిందూస్థాన్ యూనీలీవర్ లో జీఎస్కే విలీనానికి అడ్డంకి తొలగిపోయింది.