Telangana: తెలంగాణను చూసి నేర్చుకోవాలని గాంధీ ఆనాడే చెప్పారు: కేసీఆర్
- ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు
- రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- మతసామరస్యానికి తెలంగాణ ప్రతీక అన్న సీఎం
మతసామరస్యం అంటే ఎలా ఉంటుందో తెలంగాణను చూసి నేర్చుకోవాలని గాంధీజీ ఆనాడే చెప్పారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ ఉర్దూలో మాట్లాడుతూ.. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ అన్న మాటలను గుర్తు చేశారు.
మత సామరస్యానికి తెలంగాణ ప్రతీక అని పేర్కొన్న కేసీఆర్ ఈ విషయాన్ని గాంధీ ఎప్పుడో చెప్పారన్నారు. మత సామరస్యాన్ని తెలంగాణను చూసి నేర్చుకోవాలని గాంధీ అప్పుడే చెప్పారన్నారు. విందులో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ బీబీ పాటిల్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తదితరులు పాల్గొన్నారు.