Jagan: వ్యాధి ఏదైనా వైద్యం ఉచితమే... కసరత్తు చేస్తున్న జగన్!
- పాదయాత్రలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్
- ఈ ఉదయం ఆరోగ్య శాఖాధికారులతో సమీక్ష
- నివేదికలు తయారు చేస్తున్న అధికారులు
పేదలపై వైద్య చికిత్సల భారం లేకుండా చూస్తామని, ఎటువంటి వ్యాధి అయినా ఉచితంగా వైద్యాన్ని అందించేలా చూస్తానని పాదయాత్ర సందర్భంగా ప్రజలకు తానిచ్చిన హామీని అమలుపరిచే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు. ఈ ఉదయం చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సహా, వైద్య ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన, సమీక్ష నిర్వహించారు.
ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచి, మంచి ఫలితాలను సాధించాలన్నదే తన లక్ష్యమని అధికారులకు సూచించిన ఆయన, అందరికీ వైద్య సదుపాయాలను దగ్గర చేయాలని ఆదేశించారు. కాగా, రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలపై నివేదికలు తయారు చేస్తున్న అధికారులు, వాటిని సీఎంకు త్వరలోనే అందించనున్నారు.