Cricket: తలో చెయ్యి వేసిన పాక్ బ్యాట్స్ మెన్... ఇంగ్లాండ్ ముందు కళ్లుచెదిరే టార్గెట్!
- పాక్ 50 ఓవర్లలో 348/8
- హఫీజ్, సర్ఫరాజ్, బాబర్ అర్ధసెంచరీలు
- చెరో మూడు వికెట్లు తీసిన వోక్స్, అలీ
వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో పాకిస్థాన్ విధ్వంసకర బ్యాటింగ్ తో ఆకట్టుకుంది. నాటింగ్ హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది.
తొలిమ్యాచ్ లో విండీస్ పై ఘోరంగా విఫలమైన పాకిస్థాన్ టాపార్డర్ బ్యాట్స్ మెన్ ఈసారి కలసికట్టుగా కదం తొక్కారు. సీనియర్ బ్యాట్స్ మన్ మహ్మద్ హఫీజ్ 84 పరుగులు చేయగా, యువ బ్యాట్స్ మన్ బాబర్ అజామ్ 63 పరుగులు సాధించాడు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 55, ఓపెనర్లు ఇమాముల్ హక్ 44, ఫఖార్ జమాన్ 36 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు సాధించిపెట్టారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, మొయిన్ అలీ చెరో 3 వికెట్లు తీశారు. మార్క్ ఉడ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అయితే, 349 పరుగుల భారీ లక్ష్యం ఉన్నా, ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఆ జట్టు గెలుస్తుందనే స్థానిక అభిమానులు భావిస్తున్నారు.