Jagan: ఐదు లక్షల అద్దె రూ. 30 లక్షలకు పెంపు... చంద్రబాబుది వందల కోట్ల అవినీతన్న విజయసాయి రెడ్డి!
- ప్రజల సొమ్మంటే చులకనా?
- చంద్రబాబుపై మండిపడ్డ విజయసాయి
- ఆశా సిస్టర్లలో వెలుగులు నింపిన జగన్
వివిధ ప్రభుత్వ భవనాలకు అద్దె చెల్లింపు విషయంలో చంద్రబాబు సర్కారు వందల కోట్ల అవినీతికి పాల్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "ఆఫీసుల అద్దె చెల్లింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల అవినీతికి పాల్పడింది. నక్కల రోడ్డులోని పంచాయతీ రాజ్. గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసుకు ఐదు లక్షల లోపే అద్దె చెల్లించేవారు. దాన్ని రూ.30 లక్షల అద్దె బిల్డింగులోకి షిఫ్ట్ చేశారు. ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ?" అని ప్రశ్నించారు.
అంతకుముందు "ఆశా సిస్టర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి ఒకేసారి 10 వేలకు పెంచి వైఎస్ జగన్ గారు 50 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. అక్రిడేటేడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టు(ఆశా) సోదరీమణులపై చంద్రబాబు ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించింది. అరెస్టులు చేసి హింసలు పెట్టారు" అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.