Ballot Papers: తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు... బ్యాలెట్ పత్రాలకు చెదలు!
- పోలింగ్ తేదీకి, లెక్కింపు తేదీకి మధ్య ఎక్కువ రోజుల వ్యత్యాసం
- స్ట్రాంగ్ రూమ్ లలో ఉండిపోయిన బ్యాలెట్ బాక్స్ లు
- చెదలు పట్టిన బ్యాలెట్ పేపర్లను పరిశీలిస్తున్న అధికారులు
తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిమిత్తం బ్యాలెట్ బాక్స్ లను తెరచిన అధికారులు అవాక్కయ్యారు. గత నెలలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగగా, పోలింగ్ కు, ఓట్ల లెక్కింపునకు మధ్య ఎక్కువ రోజుల వ్యత్యాసం ఉండటంతో బ్యాలెట్ బాక్సులన్నీ స్ట్రాంగ్ రూమ్ లలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో కొన్ని బ్యాలెట్ బాక్స్ లను చెదలు పట్టాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అంబట్ పల్లి ఎంపీటీసీ పరిధిలోని బ్యాలెట్ పత్రాలను చెదలు పాడుచేశాయి. వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదిలావుండగా, ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం, పలు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని చూపుతున్నారు. కొన్ని చోట్ల కరెంటు సరఫరా లేక కౌంటింగ్ నిలిచింది. అత్యధిక కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రానికి తుది ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.