BCCI: వైజాగ్ లో టెస్ట్, హైదరాబాద్ లో టీ-20... 2020 మార్చి వరకూ టీమిండియా షెడ్యూల్ విడుదల!
- ఇండియాలో పర్యటించనున్న పలు దేశాలు
- ఫ్రీడమ్ ట్రోఫీతో ప్రారంభం కానున్న 2019-20 సీజన్
- ఇండియాకు రానున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఆస్ట్రేలియా
2019-20 క్రికెట్ సీజన్ లో భారత జట్టు స్వదేశంలో ఆడనున్న మ్యాచ్ ల షెడ్యూల్ ను బీసీసీఐ ఈ ఉదయం విడుదల చేసింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి 2020 మార్చి వరకూ టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్ లు, 9 వన్డేలు, 12 టీ-20లను ఇండియాలో ఆడనుంది. వరల్డ్ కప్ తరువాత ఇండియాలో భారత మ్యాచ్ లు ఫ్రీడమ్ ట్రోఫీతో ప్రారంభమవుతాయి. ఓ టెస్ట్ మ్యాచ్ కి విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. హైదరాబాద్ స్టేడియంలో టీ-20 మ్యాచ్ జరుగుతుంది. బీసీసీఐ వెల్లడించిన షెడ్యూల్ ఇది.
ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ఫ్రీడమ్ ట్రోఫీలో భాగంగా సెప్టెంబరు 15న మొదటి టీ-20 ధర్మశాలలో, 18న రెండో టీ-20 మొహాలీలో, సెప్టెంబరు 22న మూడో టీ- 20 బెంగళూరులో జరగనున్నాయి. అక్టోబరు 2 నుంచి 6 వరకూ తొలి టెస్టు విశాఖపట్నంలో, 10 నుంచి 14 వరకూ రెండో టెస్ట్ రాంచీలో, 19 నుంచి 23 వరకూ మూడో టెస్ట్ పుణెలో జరగనున్నాయి.
ఆపై నవంబర్ లో బంగ్లాదేశ్ పర్యటనకు రానుంది. నవంబరు 3న తొలి టీ-20 న్యూఢిల్లీలో, 7న రెండో టీ-20 రాజ్ కోట్ లో, 10న మూడో టీ-20 నాగపూర్ లో జరగనున్నాయి. ఆపై నవంబర్ 14 నుంచి 18 వరకూ తొలి టెస్ట్ ఇండోర్ లో, 22 నుంచి 26 వరకూ రెండో టెస్ట్ కోల్ కతాలో జరగనున్నాయి.
డిసెంబర్ లో వెస్టిండీస్ జట్టు ఇండియాలో పర్యటించనుంది. డిసెంబర్ 6న తొలి టీ-20 ముంబైలో, 8న రెండో టీ-20 తిరువనంతపురంలో, 11న మూడో టీ-20 హైదరాబాద్ లో జరగనున్నాయి. అదే నెలలో 15న తొలి వన్డే చెన్నైలో, 18న రెండో వన్డే విశాఖపట్నంలో, 22న మూడో వన్డే కటక్ లో జరగనున్నాయి.
జనవరిలో జింబాబ్వే జట్టు పర్యటించనుండగా, 5న తొలి టీ-20 గౌహతీలో, 7న రెండో టీ-20 ఇండోర్ లో, 10న మూడో టీ-20 పుణెలో జరగనున్నాయి. అదే నెలలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కూడా ఉంది. జనవరి 14న తొలి వన్డే ముంబైలో, 17న రెండో వన్డే రాజ్ కోట్ లో, 19న మూడో వన్డే బెంగళూరులో జరగనున్నాయి.
ఆపై మార్చిలో దక్షిణాఫ్రికా జట్టు రానుంది. మార్చి 12న తొలి వన్డే ధర్మశాలలో, 15న రెండో వన్డే లక్నోలో, 18న మూడో వన్డే కోల్ కతాలో జరుగుతాయి.