GVL: ఏపీ ప్రభుత్వ ఇఫ్తార్ విందు ఖర్చుపై జీవీఎల్ వ్యాఖ్యలు
- మత కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులా?
- జగన్ భవిష్యత్తులో ఇలా చేయరని భావిస్తున్నాం
- చంద్రబాబు ఎంతో దుబారా చేశారు
ఏపీ సీఎం జగన్ నిన్న గుంటూరులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుపై విమర్శలు వస్తున్నాయి. జగన్ తన ప్రమాణస్వీకారానికి రూ.29 లక్షలు మాత్రమే ఖర్చుగా చూపారని, అంతకంటే తక్కువ సంఖ్యలో ప్రజలు హాజరైన ఇఫ్తార్ విందుకు మాత్రం రూ.1.1 కోట్లు ఖర్చుగా చూపడం ఏంటని ఇప్పటికే విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. భారతదేశం లౌకికవాద దేశమని, ఇలాంటి దేశంలో ప్రత్యేకంగా ఓ మతపరమైన కార్యక్రమాన్ని ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించడం సరైన విధానం కాదని విమర్శించారు.
మున్ముందు జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోరనే భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీ రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రం అని, గత సీఎం చంద్రబాబు పోరాటాలు, ధర్నాలను సైతం విలాసవంతంగా మార్చేసి ఖజానాకు గండికొట్టారని ఆరోపించారు. ఇప్పుడు జగన్ ఆయన బాటలో నడవరనే ఆశిస్తున్నానని జీవీఎల్ ట్వీట్ చేశారు.