Andhra Pradesh: సీఎం జగన్ తో ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం భేటీ!
- తాడేపల్లిలోని సీఎం నివాసానికి మాజీ సీఎస్
- రాష్ట్ర పరిస్థితి సహా పలు ముఖ్యమైన అంశాలపై చర్చ
- సీఎంకు ధన్యవాదాలు తెలిపిన అజయ్ కల్లం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్ అజయ్ కల్లంను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల నియమించారు. ఈ నేపథ్యంలో అజయ్ కల్లం ఈరోజు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనకు సలహాదారు బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రికి అజయ్ కల్లం ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీలో ఏపీ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
1983 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం ముక్కుసూటి మనిషిగా పేరుపొందారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా కొద్దికాలం పనిచేసిన కల్లం.. 2017, మార్చి 31న పదవీవిరమణ చేశారు. గతంలో పలు జిల్లాలకు కలెక్టర్‌గా, టీటీడీ ఈవోగానూ ఆయన సేవలు అందించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీలో అవినీతి పెరిగిందని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.