Telangana: టీఆర్ఎస్ నేతలు ప్రజలను భయపెట్టారు.. అందుకే పరిషత్ ఎన్నికల్లో ఓడిపోయాం!: షబ్బీర్ అలీ
- జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కారు జోరు
- పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కే ఓట్లు పడ్డాయన్న అలీ
- సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజల్ని బెదిరించారన్న కాంగ్రెస్ నేత
తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించడంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రజలను భయపెట్టి గెలిచిందని షబ్బీర్ అలీ ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ బెదిరింపులు పనిచేయలేదని వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో ఈరోజు మీడియాతో షబ్బీర్ అలీ మాట్లాడారు.
పరిషత్ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు కాంగ్రెస్ కు ఓటేశారని షబ్బీర్ అలీ తెలిపారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను ‘టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఆగిపోతాయి. ప్రభుత్వ పథకాలు రావు’ అని ఆ పార్టీ నేతలు బెదిరించారని ఆరోపించారు. అందుకే గ్రామీణులు భయపడి టీఆర్ఎస్ కు ఓటేశారని పునరుద్ఘాటించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.