Telangana: ఐఏఎస్ అధికారికి నెల రోజుల జైలుశిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు!
- కరీంనగర్ లో కమిషనర్ గా పనిచేసిన శశాంక్
- భవనాల కూల్చివేతపై హైకోర్టు ఆదేశాలను పాటించని అధికారి
- కోర్టు ధిక్కార నేరం రుజువు కావడంతో శిక్ష
కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న ఆరోపణలను విచారించిన తెలంగాణ హైకోర్టు, ఐఏఎస్ అధికారి, కరీంనగర్ నగరపాలక సంస్థ మాజీ కమిషనర్ కె.శశాంక్ కు నెలరోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఇదే సమయంలో రూ. 25 వేల జరిమానా కూడా విధించింది. జరిమానాను తన డబ్బు నుంచే చెల్లించాలని, ఇది చెల్లించకుంటే, మరో రెండు వారాలపాటు శిక్ష అనుభవించాలని పేర్కొంటూ జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి తీర్పిచ్చారు. అయితే, అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును ఆరు వారాలపాటు నిలిపివేస్తున్నట్టు ఆయన తెలిపారు.
కాగా, కరీంనగర్ లో 1980వ దశకంలో మునిసిపాలిటీ నుంచి అనుమతి తీసుకుని నివాస భవనాలు, షాపులు నిర్మించుకోగా, ఆపై నగర విస్తరణలో భాగంగా, నోటీసులివ్వకుండానే పిటిషనర్ నివాస భవనాన్ని, షాపులను అధికారులు కూల్చివేశారు. దీనిపై గతంలో స్టే ఆదేశాలను ఇచ్చిన హైకోర్టు, ఆపై కేసు విచారించి, పిటిషనర్ కోల్పోయిన 13 షాపులు తిరిగి కేటాయించాలని, లేదా నిబంధనల ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని 2015 జనవరిలో ఆదేశాలిచ్చింది.
కోర్టు ఆదేశాలను అధికారులు పాటించకపోవడంతో, పిటిషనర్ మరోమారు కోర్టును ఆశ్రయించి, ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, కార్పొరేషన్ అధికారుల తీరుని తప్పుబడుతూ, అప్పటి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక్ కు శిక్ష ఖరారు చేశారు.