NEET: నీట్ ఫలితాలు వెల్లడి... తెలంగాణ అమ్మాయికి ఏడో ర్యాంకు
- ఢిల్లీ విద్యార్థి నళిన్ ఖండేల్వాల్ టాప్ ర్యాంక్ కైవసం
- టాప్50లో తెలుగు రాష్ట్రాలకు నాలుగు ర్యాంకులు
- 16వ ర్యాంకు దక్కించుకున్న ఏపీ అమ్మాయి ఆస్రా ఖురేషీ
దేశవ్యాప్తంగా మెడికల్ ప్రవేశాల కోసం నిర్దేశించిన నీట్ అర్హత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మధ్యాహ్నం ఎన్టీయే నీట్ ర్యాంకులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 56.27 శాతంతో 7,97,042 మంది ఉత్తీర్ణులయ్యారు. ఢిల్లీకి చెందిన నళిన్ ఖండేల్వాల్ మొదటి ర్యాంకు సాధించాడు. ఖండేల్వాల్ కు నీట్ లో అత్యధికంగా 701 మార్కులు లభించాయి.
ఇక, ఏపీలో 72.55 శాతంతో 39.039 మంది ఉత్తీర్ణులు కాగా, తెలంగాణలో 68.88 శాతంతో 33,044 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కాగా, నీట్ ఫలితాల్లో టాప్ 50లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు విద్యార్థులు స్థానం సంపాదించారు. తెలంగాణకు చెందిన మాధురీ రెడ్డి అత్యధికంగా ఏడో ర్యాంకు సాధించింది. మాధురీ రెడ్డికి 695 మార్కులు వచ్చాయి. 690 మార్కులు సాధించిన ఏపీ విద్యార్థిని ఆస్రా ఖురేషీకి 16వ ర్యాంకు దక్కింది. ఇతరుల విషయానికొస్తే, ఏపీకి చెందిన పిల్లి భానుశివతేజకు 40వ ర్యాంకు, ఎస్.శ్రీనందన్ రెడ్డికి 42వ ర్యాంకు దక్కాయి.