Chandrababu: ఈ ఐదేళ్లలో జరిగిన ఘటనలను చంద్రబాబుకు వివరించిన కేశినేని నాని
- కేశినేని నాని అలక
- ఇంటికి పిలిపించుకుని బుజ్జగించిన చంద్రబాబు
- అనేక విషయాలు ఏకరవుపెట్టిన విజయవాడ ఎంపీ!
ఎన్నికల ఫలితాలతో డీలాపడిన తెలుగుదేశం పార్టీ కేశినేని నాని వ్యవహారంతో ఉలిక్కిపడింది. లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో నాని ఒకరు. ఆయన లోక్ సభలో పార్టీ విప్ పదవి వద్దని చెప్పడంతో అసలేం జరుగుతోందోనని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే, పార్టీ అధినేత చంద్రబాబు సకాలంలో స్పందించి కేశినేని నానిని తన వద్దకు రప్పించుకుని ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్య సద్దుమణిగేలా చేశారు.
కాగా, చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమైన నాని, పార్టీ అధినేతతో తన సమస్యలు ఏకరవు పెట్టారు. ఈ ఐదేళ్ల కాలంలో పార్టీలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, అసంతృప్తి కలిగించిన ఘటనలను చంద్రబాబుకు వివరించారు. ముఖ్యంగా, కృష్ణా జిల్లా రాజకీయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా, లోక్ సభ విప్ గా బాధ్యతలు తీసుకోవాలని చంద్రబాబు కోరినా నాని మనసు మార్చుకోలేదు. లోక్ సభాపక్ష ఉపనేత, విప్ పదవులు వద్దని, తాను ఎంపీగానే కొనసాగుతానని అధినేతకు తేల్చిచెప్పారు. తాను టీడీపీని వీడే ప్రసక్తేలేదని, పార్టీ కోసం చివరివరకు పనిచేస్తానని కేశినేని ఉద్ఘాటించారు.