Velagapudi Ramakrishna: జగన్ ను దూషించినందుకు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అరెస్ట్.. వెంటనే స్టేషన్ బెయిల్!
- ఎన్నికల ఫలితాల వేళ జగన్ పై విమర్శలు
- కేసు పెట్టిన వైసీపీ నాయకురాలు విజయనిర్మల
- వైసీపీ కక్ష సాధిస్తోందన్న వెలగపూడి
గత నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను దూషించారంటూ వైసీపీ నేత చేసిన ఫిర్యాదుతో విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబును ఎంవీపీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ప్రాంత వైసీపీ నేత అక్కరమాని విజయనిర్మల, గత నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేయగా, ద్వారకా జోన్ ఏసీపీ వైసీ నాయుడు, సీఐ లక్ష్మోజీలు విచారణ జరిపి, భారతీయ శిక్షాస్మృతిలోని 294 (బీ), 188 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసులో స్టేషన్ కు వచ్చి బెయిల్ తీసుకుని వెళ్లాల్సిందేనని పోలీసులు స్పష్టం చేయడంతో రామకృష్ణ పోలీసుల ఎదుట హాజరు కాగా, అరెస్ట్ చూపించి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఆపై వెలగపూడి మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టిందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అందుకు తన కేసే ఓ ఉదాహరణని అన్నారు. ప్రజలంతా చూస్తున్నారని, తగు సమయంలో వారే బుద్ధి చెబుతారని అన్నారు.