CM Jagan: జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు నిర్ణయం సాహసోపేత అడుగు: ఎంపీ విజయసాయిరెడ్డి
- ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని అభినందిస్తూ ట్వీట్
- టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా ఉపయుక్తం
- కొత్త ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉంటుందనేందుకు ఇది ఉదాహరణ
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్ణయం సాహసోపేతమైనదని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ నిర్ణయాన్ని అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
కొన్ని సందర్భాల్లో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తితో విచారణ జరిపించే సంప్రదాయం ఉందని, కానీ ఇప్పుడు నిరంతర స్క్రూటినీ విధానానికి అవకాశం ఏర్పడిందన్నారు. జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వ పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతుందో చెప్పేందుకు ఇది ఉదాహరణ అన్నారు. జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు వల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడడంతోపాటు న్యాయపరమైన వివాదాలు లేకుండా చూడవచ్చునని పేర్కొన్నారు.