MUMBAI: సామాన్యులకు ఊరట.. రెపో రేటును 25 పాయింట్లు తగ్గించిన రిజర్వు బ్యాంకు!
- ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్ష
- వడ్డీరేట్లు తగ్గిస్తూ రిజర్వు బ్యాంకు నిర్ణయం
- ఆర్టీజీఎస్, నెఫ్ట్ సర్వీసులపై చార్జీల ఎత్తివేత
భారత ఆర్థిక వృద్ధిరేటుకు ఊతం ఇచ్చేలా రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గనుంది. దీనివల్ల పరిశ్రమలు, వ్యక్తులకు ఇచ్చిన రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు తగ్గుతాయి. అలాగే ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఆర్థిక వ్యవహారాలపై చార్జీలను ఆర్బీఐ పూర్తిగా ఎత్తివేసింది.
2019లో ఇప్పటికే రెండుసార్లు వడ్డీరేట్లను తగ్గించిన రిజర్వు బ్యాంకు, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా మరోసారి వడ్డీరేట్లకు కోత పెట్టింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, అదే సమయంలో వృద్ధిరేటు తగ్గడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు 2019-20 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు అంచనాలను ఆర్బీఐ 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది తొలి అర్థభాగంలో ద్రవ్యోల్బణం 3 నుంచి 3.1 శాతంగా ఉంటుందని రిజర్వు బ్యాంకు అంచనా వేసింది.