MS Dhoni: అభిమానుల ట్రోలింగ్ తట్టుకోలేక ధోనీ గ్లోవ్స్ వివాదంపై వెనక్కి తగ్గిన ఐసీసీ
- ధోనీ గ్లోవ్స్ పై బలిదాన్ గుర్తు
- అభ్యంతరం చెప్పిన ఐసీసీ
- సామాజిక మాధ్యమాల్లో భారీగా ట్రోలింగ్
క్రికెట్ మైదానంలోనూ, వెలుపల దేశం పట్ల ధోనీ నిబద్ధతను ఎవరూ శంకించలేరు. ధోనికి భారత సైన్యం అన్నా, పారా మిలిటరీ భద్రతా బలగాలు అన్నా ఎంతో గౌరవం. ధోనీ భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ గా కొనసాగుతున్నాడు. అయితే, ఇప్పుడు ధోనీ గ్లోవ్స్ పై పారా మిలిటరీ దళాల స్మారక చిహ్నం 'బలిదాన్' ఉండడంపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ప్రస్తుతం ధోనీ వరల్డ్ కప్ లో మ్యాచ్ లు ఆడుతుండగా, అతడి గ్లోప్స్ పై ఉన్న బలిదాన్ గుర్తు టీవీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ఐసీసీ స్పందిస్తూ, రాజకీయ, మతపరమైన గుర్తుల్ని ఆటగాళ్ల జెర్సీలు, కిట్ లపై అంగీకరించబోమని పేర్కొంది.
అయితే, దీనిపై ధోనీ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్థాన్ క్రికెటర్లు ఏకంగా మైదానంలోనే ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు ఈ నిబంధనలు ఏమైపోయాయి? ఈ ఐసీసీ అప్పుడెక్కడికి వెళ్లింది? అంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నెటిజన్ల ట్రోలింగ్ తట్టుకోలేక ఐసీసీ వెనుకంజ వేసింది.
ధోనీ కీపింగ్ గ్లోవ్స్ పై ఉన్న గుర్తు ఏ మతానికి చెందినది కాదని, ఏ రాజకీయపరమైన గుర్తు కాదని బీసీసీఐ వివరణ ఇస్తే ధోనీ నిరభ్యంతరంగా ఆ గ్లోవ్స్ ధరించవచ్చని ఐసీసీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు, ఐసీసీ తీరుతో ఆగ్రహానికి గురైన అభిమానులు, ఐసీసీ ఆ గ్లోవ్స్ వద్దని చెబితే టీమిండియా ప్రపంచకప్ నుంచైనా వైదొలగాలే తప్ప ధోనీ ఆ గ్లోవ్స్ మాత్రం తొలగించరాదని ట్వీట్లు చేస్తున్నారు.