MS Dhoni: గ్లోవ్స్ వివాదంలో ధోనీకి బాసటగా నిలిచిన బీసీసీఐ
- స్పందించిన బీసీసీఐ వర్గాలు
- ఇంతకుముందే అనుమతి కోరామన్న బీసీసీఐ చీఫ్ వినోద్ రాయ్
- బలిదాన్ గుర్తు వాణిజ్యపరమైనది కాదన్న ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా
వరల్డ్ కప్ లో టీమిండియా వికెట్ కీపర్ ధోనీ ధరించిన గ్లోవ్స్ పై ఐసీసీ అడ్డుచెప్పడం పట్ల బీసీసీఐ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై తాము ఇంతకుముందే ఐసీసీ అనుమతి కోరామని, ఐసీసీతో సమావేశమై గ్లోవ్స్ అంశంపై మరింత విపులంగా చర్చిస్తామని బీసీసీఐ పాలకమండలి చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు.
అటు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సైతం ఐసీసీని తప్పుబట్టారు. బలిదాన్ గుర్తులున్నంత మాత్రాన ధోనీ గ్లోవ్స్ పై అభ్యంతరం చెప్పాల్సిన అవసరంలేదన్నారు. "బలిదాన్ గుర్తు ఏమైనా వాణిజ్య పరమైన గుర్తా? అది జాతి గౌరవానికి సంబంధించిన చిహ్నం. దీన్ని ఐసీసీ విశాలదృక్పథంతో చూడాలి" అంటూ వ్యాఖ్యలు చేశారు.
కాగా, తమపై తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో ఐసీసీ వర్గాలు ధోనీ గ్లోవ్స్ వివాదంపై వివరణ ఇచ్చాయి. ధోనీ గ్లోవ్స్ పై ఉన్న చిహ్నాలను తొలగించాలని బీసీసీఐకి సూచించామని, దానిపై బీసీసీఐ వివరణ ఇచ్చిందని ఐసీసీ జనరల్ మేనేజర్ క్లైరే ఫర్లాంగ్ తెలిపారు. బీసీసీఐ స్పందనను ఐసీసీ హైకమాండ్ దృష్టికి తీసుకెళతామని, తుదినిర్ణయం వాళ్లే తీసుకుంటారని ఫర్లాంగ్ స్పష్టం చేశారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఐసీసీ చైర్మన్ గా వ్యవహరిస్తోంది ఓ భారతీయుడే. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన శశాంక్ మనోహర్ భారత క్రికెట్ వ్యవస్థపై అసహనంతో ఐసీసీ వైపు మళ్లారు. ఆయన చైర్మన్ గా ఎన్నికైనప్పటి నుంచి బీసీసీఐని తనదైన శైలిలో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.