Talasani: కేవలం ఫొటోషూట్ కోసమే దొంగ దీక్ష చేస్తున్నారు: కాంగ్రెస్ నేతలపై తలసాని ఫైర్
- ఇందిరాపార్క్ వద్ద నడుస్తోంది ఓ పెద్ద డ్రామా
- దొంగే దొంగ అని అరిచినట్టుంది
- గ్రూపు రాజకీయాలు భరించలేకే ఆ 12 మంది టీఆర్ఎస్ లో చేరారు
తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 19 స్థానాలు రాగా, 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరడం రాజకీయ దుమారానికి కారణమైంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో స్పందించడమే కాకుండా, ఇందిరాపార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగింది. దీనిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు.
ఇందిరాపార్క్ వద్ద నడుస్తోంది పెద్ద డ్రామా అని అభివర్ణించారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్టుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేవలం ఫొటోషూట్ కోసమే దొంగ దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో ఉన్న గ్రూపు రాజకీయాలు తట్టుకోలేకే ఆ 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పక్షాన చేరారని తలసాని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ 19 మందిలో 3 గ్రూపులు ఉన్నాయంటూ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడితే వారి చరిత్ర మొత్తం బయటపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భూపతిరెడ్డి లాంటి వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. మీరు చేస్తే సంసారం, మేం చేస్తే వ్యభిచారమా? అంటూ ప్రశ్నించారు.