Siachen: సియాచిన్‌లో మైనస్ 60 డిగ్రీల ఉష్ణోగ్రత.. సుత్తితో కొట్టినా పగలని గుడ్లు!
- గడ్డకట్టుకుపోతున్న ఆహార పదార్థాలు
- రాయిలా మారిపోతున్న గుడ్లు, టమాటాలు
- కడుపు నింపుకునేందుకు సైనికుల పాట్లు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా ఖ్యాతిగాంచిన సియాచిన్‌లో వాతావరణం దారుణంగా ఉంది. వాతావరణం మైనస్ 60 డిగ్రీలకు చేరుకోవడంతో భారత సైనికుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆహార పదార్థాలు గడ్డకట్టుకుపోయి తినడానికి పనికిరాకుండా పోతున్నాయి. తాగానికి నీళ్లు కూడా కరవుతున్నాయి. పళ్ల రసాలు గడ్డకట్టుకుపోగా, గుడ్లు, కూరగాయలు అన్నీ రాళ్లలా మారాయి. బలమంతా ఉపయోగించి సుత్తితో బలంగా కొడితే కానీ గుడ్లు పగలడం లేదు. జ్యూస్ తాగాలంటే గట్టకట్టిన దానిని ఓ పాత్రలో పెట్టి వేడి చేయాల్సి వస్తోంది. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ముగ్గురు జవాన్లు ఆహారాన్ని తీసుకునేందుకు పడుతున్న పాట్లు కనిపిస్తాయి. జ్యూస్ బాక్స్‌ను ఓపెన్ చేస్తే లోపల ఇటుకలా గడ్డకట్టుకుపోయిన రసం కనిపించగా, మరో సైనికుడు దానిని సుత్తితో కొట్టడం కనిపిస్తోంది. దాని తర్వాత గుడ్లను పగలగొట్టేందుకు వారు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. నేలకేసి బలంగా కొట్టినా గుడ్లు పగలడం లేదు. చివరికి సుత్తితో పలుమార్లు బలంగా కొడితే తప్ప పగలడం లేదు. సియాచిన్‌లో పరిస్థితి ఇలా ఉందని ఓ సైనికుడు నవ్వుతూ చెప్పాడు. ఇక, ఉల్లిపాయలు, టమాటాలు, ఆలుగడ్డలు, వెల్లుల్లి పరిస్థితి కూడా ఇదేనని వాపోయాడు.