Ravinder Raina: నా పేరు ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉంది: జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా

  • హిజ్బుల్ ముజాహిదీన్ హిట్ లిస్ట్‌లో రైనా పేరు
  • ఆయన ఇల్లు, కార్యాలయం వద్ద ఉగ్రవాదుల రెక్కీ
  • గతంలోనూ ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్

జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ హిట్ లిస్ట్‌లో తన పేరు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ పాకిస్థానీ, ఇద్దరు కశ్మీర్ ఉగ్రవాదులకు తనను అంతం చేసే పని అప్పగించారని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఇంటెలిజెన్స్ సంస్థలు హై అలెర్ట్ ప్రకటించాయి. రైనా కదలికలపై ఉగ్రవాదులు ఇప్పటికే ఓ కన్నేశారని, ఆయన కార్యాలయం, నివాసాల వద్ద రెక్కీ కూడా నిర్వహించారని తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఉగ్రకార్యకలాపాలపై తరచూ పాకిస్థాన్‌ను నిందించే రైనాకు హెచ్చరికలు రావడం ఇదే తొలిసారి కాదు.

గతేడాది జూన్‌లో పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించాడు. పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, రైజింగ్ కశ్మీర్ పత్రిక ఎడిటర్ షుజాత్ బుఖారీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారని అప్పట్లో ఆయన పేర్కొన్నారు.

42 ఏళ్ల రైనా జమ్ములోని హిందువులు అత్యధికంగా ఉండే నౌషేరా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరెస్సెస్ ప్రచారక్ కూడా అయిన రైనా సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేయగా, ఇంటర్నేషనల్ లా, హ్యూమన్ రైట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News