Vikarabad District: చాటింగ్ చేస్తే ప్రాణం పోయింది...కుప్పకూలి మృతి చెందిన బీజేపీ నేత
- ప్రాణమీదికి తెచ్చిన అనవసర వివాదం
- వాగ్వాదంతో రక్తపోటు పెరిగి అస్వస్థత
- ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం
అనవసర రాజకీయ వాగ్వాదం ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. ఫోన్లో చాటింగ్ చేస్తూ రాజకీయ విమర్శలు, ఫోన్లోనే నేరుగా వాగ్వాదంతో బీపీ పెరిగి తీవ్ర అస్వస్థతకు గురైన వ్యక్తి అనంతరం మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుక్మాపూర్‌లో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే...రుక్మాపూర్‌కి చెందిన చెరుకుపల్లి రమేష్ (34) మంబాపూర్లో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్నాడు. ఇతను ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారుగా సర్పంచ్‌గా పోటీచేసి ఓటమి పాలయ్యాడు.
ఆ సందర్భంలో ఊర్లో ఉన్న వారితో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. శుక్రవారం ఎంపీపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ గ్రూప్‌లో చాటింగ్ చేశాడు. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అభ్యంతకర మెసేజ్ పెట్టడంతో ఇద్దరి మధ్య చాటింగ్‌లో వాగ్వాదం మొదలయింది. కొంతసేపు విమర్శలు కొనసాగిన తర్వాత రమేష్ నేరుగా సదరు వ్యక్తికే ఫోన్‌చేసి వాగ్వాదానికి దిగాడు.
దాదాపు అరగంటపాటు ఇద్దరి మధ్యా వాగ్వాదం కొనసాగింది. ఈ సమయంలో రమేష్ రక్తపోటు ఎక్కువై కళ్లు తిరిగి పడిపోయాడు. దీన్ని గమనించి భార్య సంతోషిణి వెంటనే అతన్ని సమీపంలోని తాండూరు ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే రమేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రక్తపోటు అధికమై మెదడులో నరాలు చిట్లి పోయి చనిపోయినట్లు చెప్పడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.