IBM: 2000 మంది ఉద్యోగులకు మంగళం పాడిన ఐటీ దిగ్గజ సంస్థ!
- ప్రమాణాలు అందుకోలేని ఉద్యోగులపై వేటు
- క్లౌడ్, ఏఐ రంగాలపై దృష్టిపెట్టిన ఐబీఎం
- సమర్థులైన ఉద్యోగుల కోసం అన్వేషణ
అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 2000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనందునే వారందరినీ ఉద్యోగం నుంచి తొలగించినట్టు ఐబీఎం వెల్లడించింది. వాస్తవానికి ప్రస్తుతం వేటుకు గురైన ఉద్యోగులు ఐబీఎం ఉద్యోగుల సంఖ్యలో ఒక్క శాతం కంటే తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఐబీఎం కార్యాలయాల్లో 3 లక్షల మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు.
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలన్న మా ప్రయత్నంలో భాగంగా సమర్థత చూపలేని ఉద్యోగులను తొలగించడం సాధారణమైన విషయమేనని ఐబీఎం పేర్కొంది. కొన్ని ప్రత్యేకమైన విభాగాల్లో కొత్తగా ఉద్యోగులను ఎంపిక చేసుకుని వినియోగదారులకు సేవలు అందిస్తామని వివరించింది. ఇటీవలకాలంలో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్న ఐబీఎం సమర్థుల కోసం గాలిస్తోంది.