Cricket: ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన టీమిండియా బ్యాట్స్ మెన్... ఆసీస్ టార్గెట్ 353 రన్స్
- ధావన్ సెంచరీ
- కోహ్లీ 82
- పాండ్య, ధోనీ మెరుపుదాడి
లండన్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ శివమెత్తి ఆడారు. ఓపెనర్ల నుంచి కేఎల్ రాహుల్ వరకు బ్యాట్లు ఝుళిపించి ఆసీస్ బౌలింగ్ ను ఊచకోత కోశారు. దాంతో టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఓపెనర్ శిఖర్ ధావన్ (117) అద్భుతమైన సెంచరీతో ఆసీస్ బౌలింగ్ ను ఆటాడుకోగా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ (57) ఫిఫ్టీతో తన పాత్రకు న్యాయం చేశాడు. ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీ (82) నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. మధ్యలో హార్దిక్ పాండ్య, ధోనీ మెరుపుదాడితో మ్యాచ్ లో మాంచి ఊపు కనిపించింది.
పాండ్య 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 48 పరుగులు చేయగా, ధోనీ 14 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ తో 27 పరుగులు సాధించాడు. ఆఖర్లో కేఎల్ రాహుల్ సైతం ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి తన ఫామ్ చాటుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టొయినిస్ 2 వికెట్లు తీశాడు. కమిన్స్, స్టార్క్, కౌల్టర్ నైల్ తలో వికెట్ దక్కించుకున్నారు.