Nirmala Sitharaman: జూలై 5న కేంద్ర బడ్జెట్.. సన్నాహాలు మొదలుపెట్టిన నిర్మలా సీతారామన్
- బడ్జెట్ కు ముందు అభిప్రాయ స్వీకరణ
- వివిధ శాఖల నిపుణలతో ఆర్థికమంత్రి సమావేశాలు
- రేపు ఉదయం వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ నిపుణులతో భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. జూలై 5న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సన్నాహాలు ప్రారంభించారు. ముందుగా బడ్జెట్ పై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. రేపటి నుంచి శాఖల వారీగా నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు.
రేపు ఉదయం మొదట వ్యవసాయ రంగ నిపుణులతో నిర్మలా సీతారామన్ భేటీ కానున్నారు. దాంతోపాటే గ్రామీణ అభివృద్ధి శాఖ నిపుణులతోనూ ఆమె మాట్లాడతారు. అనంతరం, మధ్యాహ్నం నుంచి పారిశ్రామిక, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నిర్మలా సీతారామన్ ఈ పర్యాయం ఆర్ధికమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో, ఆమె రూపొందించే బడ్జెట్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.