Cricket: వాన దెబ్బ!... ఫలితం తేలకుండానే ముగిసిన దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్
- సౌతాంప్టన్ లో ఎడతెరిపిలేని వర్షం
- దక్షిణాఫ్రికా స్కోరు 7.3 ఓవర్లలో 2 వికెట్లకు 29
- ఇరు జట్లకు చెరో పాయింట్
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇవాళ వరుణుడిదే పైచేయిగా నిలిచింది. సౌతాంప్టన్ లో వర్షం ఎంతకీ ఆగకపోవడంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ ను రద్దు చేశారు. వర్షం మధ్యలో విరామం ఇచ్చినప్పుడు అంపైర్లు మైదానాన్ని పరీక్షించినా మ్యాచ్ కు అనువుగా లేదని తేల్చేశారు. దానికితోడు వర్షం మళ్లీ మొదలవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
అంతకుముందు వెస్టిండీస్ ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. లెఫ్టార్మ్ సీమర్ షెల్డర్ కాట్రెల్ విజృంభించడంతో దక్షిణాఫ్రికా వెంటవెంటనే రెండు వికెట్లు చేజార్చుకుంది. వర్షం కారణంగా పోరుకు అంతరాయం కలిగే సమయానికి సఫారీలు 7.3 ఓవర్లలో 2 వికెట్లకు 29 పరుగులు చేశారు. కాగా, ఈ మ్యాచ్ లో ఎలాంటి ఫలితం రాకపోవడంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.